టోక్యో, డిసెంబర్ 9: చంద్రుణ్ణి చుట్టిరావడానికి జరిగే స్పేస్-ఎక్స్ అంతరిక్షయాత్రలో తనతోపాటు భారత నటుడు దేవ్ జోషీని తీసుకొని వెళుతున్నట్టు జపాన్ కుబేరుడు యుసాకూ మయేజావా వెల్లడించారు. ఈ మొట్టమొదటి ప్రైవేటురంగ చంద్రమండల యాత్ర వచ్చే ఏడాది సాకారం కానున్నది. 2018 లో స్పేస్-ఎక్స్ ఈ యాత్రకు సంబంధించి ఎనిమిది టికెట్లు అమ్మకానికి పెడితే మొత్తం అన్నిటినీ మయేజావా బుక్ చేసుకొన్నారు.
చంద్రమండల యాత్ర కోసం 2021 మార్చిలో మయేజావా తన సహయాత్రికుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. కొరియన్ పాప్గ్రూప్ ‘బిగ్‌బ్యాంగ్’ లీడ్ సింగర్‌గా రంగప్రవేశం చేసిన చోయి స్యూంగ్-హ్యూన్ అలియాస్ ‘టాప్’తో పాటుగా అమెరికా డీజే స్టీవ్ ఆవకీ, సినీ దర్శకుడు బ్రెండాన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్ ను మయేజావా తన టీమ్‌లో చేర్చుకొన్నారు. బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీమ్ ఇలియా, జెక్ చిత్రకారుడు యేమీ ఏడీ, ఐరిష్ ఫొటోగ్రాఫర్ రియానన్ ఆడమ్లనూ ఎంపిక చేసుకొన్నారు. అమెరికా ఒలింపిక్ స్నోబోర్డర్ కైత్లిన్ ఫారింగ్టన్, జపనీస్ డ్యాన్సర్ మియూలను బ్యాకప్ కింద ఎంపిక చేశారు.