ఇస్లామాబాద్, మే 5: కశ్మీరులోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఏ క్షణమైనా భారత్ సైనిక దాడి చేయవచ్చని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సోమవారం హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేస్తూ నియంత్రణ రేఖ వెంబడి ఎక్కడైనా, ఏ క్షణమైనా భారత్ సైనిక దాడి చేయవచ్చని వార్తలు వచ్చాయని అన్నారు.
భారత్‌కు దీటుగా జవాబు ఇస్తామని ఇస్లామాబాద్‌లో విలేకరులకు ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం అణు యుద్ధాన్ని తీసుకువచ్చే పరిస్థితిని భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఖైబర్ పఖ్తూంఖ్వా, బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదం వెనుక భారత్ ఉందని ఆసిఫ్ ఆరోపించారు.