LPG Ship : పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి. తాజాగా ‘గ్రీన్ ఆశా’ అనే భారత ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. శనివారం గ్రీన్ శాన్వి ఈ జలసంధిని, దాటగా ఇవాళ గ్రీన్ ఆశా దాటింది. గ్రీన్ శాన్వి హర్మూజ్‌ను దాటిన 8వ భారత నౌక కాగా, గ్రీన్ ఆశా 9వ భారత నౌక కావడం గమనార్హం. పశ్చిమాసియాలో సంక్షోభం మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధి గుండా నౌకల రవాణాను ఇరాన్ (Iran) అడ్డుకుంటోంది. భారత్ సహా కొన్ని మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తున్నది.
కాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించింది. దాంతో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. అయినప్పటికీ ఇంధన అవసరాల దృష్ట్యా భారత్ ఈ మార్గంపైనే ఆధారపడుతోంది. గ్రీన్ ఆశా కంటే ముందు కూడా అనేక భారత నౌకలు ఈ ప్రాంతాన్ని విజయవంతంగా దాటాయి. బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్ అనే రెండు ఎల్పీజీ నౌకలు సుమారు 94,000 టన్నుల కార్గోను రవాణా చేశాయి.
మార్చి నెలలో ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి అనే ట్యాంకర్లు 92,700 టన్నుల ఎల్పీజీని గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు చేర్చాయి. వీటితో పాటు ముడి చమురు, ఇతర ఇంధనాలను కూడా భారత నౌకలు రవాణా చేస్తున్నాయి. ‘జగ్ లాడ్కి’ అనే ఆయిల్ ట్యాంకర్ యూఏఈ నుంచి 80,000 టన్నుల ముడి చమురును ముంద్రా పోర్టుకు తీసుకురాగా, ‘జగ్ ప్రకాశ్’ నౌక ఒమన్ నుంచి ఆఫ్రికా మార్కెట్లకు గ్యాసోలిన్‌ను చేరవేసింది. దేశీయ ఇంధన భద్రత కోసం ఈ ప్రమాదకర మార్గంలో ప్రయాణం తప్పడం లేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి.