Martin Cooper | డెల్మార్, మార్చి 31: సెల్‌ఫోన్.. పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో అందరికీ అవసరంగా మారిన డివైజ్. మనిషి జీవిత గమనాన్ని కూడా నిర్ణయించే శక్తి దీనికి ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఫోన్‌ను కొంతమంది అవసరం మేరకు వినియోగిస్తుంటే.. మరి కొంతమంది అదే ప్రపంచం అన్నట్టుగా.. చుట్టూ ఏం జరుగుతున్నా, వారి కండ్లు మొబైల్ ఫోన్లలోనే పెట్టి అదే లోకంలో ఉండటాన్ని చూస్తుంటాం.
ఈ విపరీత పరిస్థితిపై సాక్ష్యాత్తూ ‘సెల్‌ఫోన్ పితామహుడి’గా పిలిచే 94 ఏండ్ల అమెరికా ఇంజినీర్ మార్టిన్ కూపర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొంతమంది వ్యక్తులు తమ సెల్ఫోన్లను చూసుకుంటూ.. మైండ్‌ను ఎక్కడో పెట్టి, అలా రోడ్లు, వీధులను దాటడం చూసినప్పుడు విస్తుపోవడం నా వంతు అయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పక్క నుంచి వెళ్లినప్పుడు మాత్రమే వారు ఫోన్లో నుంచి బయటకు రావడం గమనించానని పేర్కొన్నారు. జేబులో పట్టే ఒక అందమైన చిన్న వస్తువు(ఫోన్)కు అపరమిత, సరిహద్దులు లేని శక్తి ఉన్నదని ఫోన్ ప్రభావంపై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.