సరదాగా పర్యటన చేద్దామని కుటుంబంతో కలిసి వచ్చాడా యువకుడు. తల్లిదండ్రులు కూడా అతని వెంటే ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన సదరు యువకుడి వయసు 21 ఏళ్లు. మైకానోస్ నుంచి తిరిగి వస్తుండగా గ్రీస్‌లోని ఒక ప్రైవేట్ ఎయిర్‌పోర్టులో అతను ఉన్న హెలికాప్టర్ ల్యాండయింది. వెనక వస్తున్న మరో హెలికాప్టర్లో యువకుడి తల్లిదండ్రులు ఉన్నారు.
హెలికాప్టర్ ఆగీఆగగానే యువకుడు కిందకు దిగాడు. బెల్ 407 మోడల్ హెలికాప్టర్ వెనుక వైపుకు యువకుడు వెళ్లినట్లు సమాచారం. అప్పటికి ఇంకా హెలికాప్టర్ ఇంజిన్లు రన్నింగ్‌లోనే ఉన్నాయి. దాంతో అక్కడ ఉండే ఫ్యాన్ తగిలి యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు అక్కడకు వచ్చే సరికి యువకుడు మరణించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని వెనుక వస్తున్న హెలికాప్టర్ పైలట్‌కు తెలియజేయడంతో.. అతను మృతుడి తల్లిదండ్రులను నేరుగా ఏథెన్స్ అంత్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. హెలికాప్టర్ ఇంజిన్లు ఆగకుండా టూరిస్టులను ఎలా కిందకు దింపారని పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే పైలట్ సహా ఇద్దరు గ్రౌండ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఏథెన్స్ చేరుకొని, అక్కడి నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లిపోవాలనేది ఆ కుటుంబం ప్లాన్ అని స్థానిక మీడియా తెలిపింది. ఇంటికి తిరిగి వెళ్లాల్సిన సమయంలో తమ కుమారుడు మరణించడం ఆ తల్లిదండ్రులను తీవ్రమైన విషాదంలో ముంచేసింది.