డెహ్రడూన్, అక్టోబర్ 5: ఐఐటీ-రూర్కీలోని ఇన్నో ప్యాప్ (ఇన్నోవేషన్ ఇన్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ ల్యాబ్), మహారాష్ట్రకు చెందిన ‘పార్సన్ మెషినరీ’ సంయుక్తంగా గోధుమ గడ్డి నుండి పర్యావరణ అనుకూలమైన టేబుల్వేర్ను (ప్లేట్లు, కప్పులు, గిన్నెలు..మొదలైనవి) అభివృద్ధి చేసింది. గోధుమ గడ్డి దహనం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల వల్ల పర్యావరణానికి ఏర్పడే ముప్పును సరికొత్త ఆవిష్కరణ పరిష్కారం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
సంప్రదాయ ప్లాస్టిక్కు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని తెలిపారు. ‘పంట అవశేషాలను అధిక నాణ్యత, పర్యావరణ అనుకూల ఉత్పత్తులుగా ఎలా మార్చవచ్చో తమ కొత్త ఆవిష్కరణ చూపుతున్నది’ అని ఐఐటీ ప్రొఫెసర్ విభోర్ కె రస్తోగి చెప్పారు. నూతన ఆవిష్కరణ పర్యావరణ నష్టాన్ని నివారించటమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుతుంది. భారతదేశం ఏటా సుమారు 35 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో అత్యధిక భాగం దహనం చేయటం వల్ల పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తున్నది.