బాత్ (ఇంగ్లండ్), మే 7: ఒక్క వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అంతే ఇక మీ మానసిక సమస్యలు పరార్ అయిపోతాయట. డిప్రెషన్, కోపం, అసహనం వంటివి దూరం అవుతాయట. మీలో మీరే కొత్త మనిషిని చూసుకోవచ్చట. ఈ విషయాలన్నీ తాజా అధ్యయనంలో తేలాయి. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ పరిశోధక బృందం ఈ అధ్యయనం జరిపింది. ఈ వివరాలు సైబర్ ‘సైకాలజీ బిహేవియర్, సోషల్ నెట్వర్కింగ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్న వారి మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని వీరు క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్ వంటి వాటికి దూరంగా ఉండాలని యూజర్లకు సూచించారు. వారం రోజుల్లోనే వారిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.