లండన్: సుమారు 15 ఏళ్లుగా సిక్ లీవ్‌లో ఉన్న ఐబీఎం ఉద్యోగి (IBM Employee) జీతం పెంచలేదని ఆరోపిస్తూ ఆ కంపెనీపై కోర్టులో దావా వేశాడు. విస్తూపోయే ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో, ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్ ఐటీ ఉద్యోగి. అయితే అనారోగ్యం వల్ల 2008 సెప్టెంబర్ నుంచి అతడు సిక్ లీవ్‌లో ఉన్నాడు. 2013లో ఆ ఉద్యోగి ఫిర్యాదుతో సమగ్ర హెల్త్ ప్లాన్ ఒప్పందాన్ని ఆ సంస్థ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆ ఉద్యోగి పని చేయనప్పటికీ సంస్థ నుంచి తొలగించబోమని హామీ ఇచ్చింది. ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) ఐబీఎం చెల్లిస్తున్నది. అలాగే ఆ ఉద్యోగికి రిటైర్డ్ వయసు 65 ఏళ్లు వచ్చే వరకు ఈ మేరకు చెల్లించేందుకు హామీ కూడా ఇచ్చింది. 2013లో ఫిర్యాదు పరిష్కారం కోసం, ఈ సమస్యను మళ్లీ లేవనెత్తకుండా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించింది.
కాగా, గత పదేళ్లుగా పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్ ప్లాన్ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ అని ఐటీ ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్ వాపోయాడు. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కింద ఇచ్చే వేతనం పెంచాలని ఐబీఎం సంస్థను కోరారు. ఆ సంస్థ నుంచి స్పందన రాకపోవడంతో 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల ఆ కంపెనీ వివక్ష చూపుతున్నదని ఆరోపించాడు.
మరోవైపు ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు తిరస్కరించింది. ఆయనకు మెరుగైన చికిత్సతోపాటు ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీని ఐబీఎం ఇచ్చిందని న్యాయమూర్తి తెలిపారు. యాక్టివ్ ఉద్యోగులు వేతనం పెంపు పొందవచ్చని, ఇన్‌యాక్టివ్ ఉద్యోగులకు ఇది వర్తించదని పేర్కొన్నారు. అయితే పెరుగుతున్న ధరల దృష్ట్యా ఆ ఉద్యోగికి పదేళ్ల కిందట నిర్ణయించిన ప్యాకేజీ సరిపోకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆ ఉద్యోగి వైకల్యం దృష్ట్యా ఆ సంస్థ చాలా ఉదారతో ఎక్కువే చెల్లిస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో వైకల్యం పట్ల వివక్షను ఆ సంస్థ చూపడం లేదన్నారు. ఈ ఆరోపణలతో అతడు చేసిన అభ్యర్థనను తిరస్కరించారు.