వాషింగ్టన్: అమెరికా పోలీసుల దాడిలో మరణించిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియోను రెండేండ్ల తర్వాత కోర్టు ఆదేశంతో బుధవారం విడుదల చేశారు. ‘నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను’ అని సుమారు 12 సార్లు ఆ వ్యక్తి అందులో ఆర్తనాదాలు చేశాడు. చివరకు అతడు చనిపోయాడు. పోలీసుల దమనకాండపై మృతుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
2020 మార్చి 31న కాలిఫోర్నియా హైవేపై మద్యం మత్తులో వాహనం డ్రైవ్ చేసిన 38 ఏళ్ల ఎడ్వర్డ్ బ్రోన్స్టెయిన్ను పోలీస్ అధికారి డస్టీ ఒస్మాన్సన్ నేతృత్వంలోని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత అతడి నుంచి బలవంతంగా రక్త నమూనాలు సేకరించేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నించారు.
అయితే బ్రోన్‌స్టెయిన్ ప్రతిఘటించాడు. ఒక పోలీస్ అధికారి అతడ్ని బలవంతంగా నేలకు అదిమిపెట్టాడు. దీంతో తాను సహకరిస్తానని అతడు అన్నాడు. ఇంతలో మరింత మంది పోలీసులు బ్రోన్స్టెయిన్ను బలంగా నేలకు నొక్కారు. దీంతో తనకు ఊపిరి ఆడటం లేదంటూ పలుమార్లు అతడు ప్రాథేయపడ్డాడు. అచేతనంగా ఉండిపోయిన అతడు చివరకు చనిపోయాడు.
మరోవైపు బ్రోన్‌స్టెయిన్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. మృతికి కారణమైన 9 మంది పోలీసులపై నేరారోపణలు చేస్తూ లాస్ ఏంజిల్స్ కౌంటీ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిన రెండేండ్లకు సీల్ చేసిన సంబంధిత వీడియో రిలీజ్‌కు కోర్టు అనుమతించింది. ‘నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను…’ అని చనిపోయే ముందు 12 సార్లు బ్రోన్‌స్టెయిన్ చేసిన ఆర్తనాదాలు, 16 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రికార్డయ్యాయి.
కాగా, బ్రోన్‌స్టెయిన్ కుమార్తె, 22 ఏండ్ల బ్రియానా పలోమినో, తన న్యాయవాదితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. రెండేండ్లుగా సీల్ చేసి ఉంచిన వీడియో రిలీజ్ కోసం ఆదేశించిన కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి చాలా మంచి వ్యక్తి ఆమె చెప్పారు. ఆయనను చెత్త మాదిరిగా పోలీసులు పరిగణించారని, ఆయన ప్రాణాలకు విలువ ఇవ్వలేదని ఆరోపించారు. తన తండ్రి మాదిరిగా అత్యంత దయనీయ స్థితిలో మరెవరూ మరణించకూడదని ఆవేదనతో అన్నారు.
కాగా, ఇది జరిగిన రెండు నెలలకు ఒక నల్ల జాతీయుడు కూడా ఇదే మాదిరిగా అమెరికా పోలీసుల చేతిలో చనిపోయాడు. 2020 మేలో 46 ఏండ్ల జార్జ్ ఫ్లాయిడ్‌ను నేలకు అదిమిన మిన్నియాపాలిస్ పోలీసు అధికారి, ఆయన గొంతును తన మోకాలితో బలంగా నొక్కాడు. దీంతో ఊపిరి ఆడటం లేదని అతడు ప్రాధేయపడ్డాడు. అనంతరం కొంతసేపటికి ఫ్లాయిడ్ చనిపోయాడు.
ఈ ఘటన నాడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అమెరికాలోని నల్ల జాతీయులు నిరసనలు వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు హింసకు దారి తీశాయి. మరోవైపు ఈ ఘటనకు బాధ్యుడైన మిన్నియాపాలిస్ పోలీసు అధికారిని డిస్మిస్ చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో అమెరికా కోర్టు ఆయనకు ఇరవై రెండున్నర ఏండ్లు జైలు శిక్ష విధించింది.