High heels : సాధారణంగా చాలామంది మహిళలు (Women) హై హీల్స్ (High heels) ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. ఎత్తు ఎక్కువగా కనిపించడం కోసం కొందరు, అడుగులు వయ్యారంగా పడటం కోసం మరికొందరు హై హీల్స్‌పై మోజు పడుతుంటారు. అయితే ఇలా హై హీల్స్ ధరించే మహిళలు అమెరికా (USA) లోని ఆ పట్టణానికి వెళ్తే మాత్రం ఆ చెప్పులను పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ హై హీల్స్ ధరించడం నిషేధం. అయితే ఈ నిషేధం కూడా మహిళ క్షేమం కోరేనట. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అది అమెరికాలోని ‘కార్మెల్ బై ది సీ’ నగరం. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నది. అక్కడి ప్రభుత్వం రెండు అంగుళాల కంటే ఎత్తయిన హై హీల్స్ ధరించడంపై నిషేధం విధించింది. చాలా ఏళ్లుగా ఈ నిషేధం కొనసాగుతున్నది. అయితే స్థానిక ప్రభుత్వం అనుమతితో మహిళలు హై హీల్స్ ధరించవచ్చట. ఇక్కడ హై హీల్స్ ధరించడం కారణంగా తనకు ఏం జరిగినా స్థానిక ప్రభుత్వానికి సంబంధం లేదనే హామీ ఇస్తే ప్రభుత్వం హై హీల్స వేసుకునేందుకు అనుమతి ఇస్తుందట. హై హీల్స్ ధరించడంవల్ల ముంచుకొచ్చే అంతపెద్ద ప్రమాదం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే అక్కడికే వెళ్దాం..
‘కార్మెల్ బై ది సీ’ నగరంలో బీచ్, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ నగరంలో సైప్రెస్, పైన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్లు భారీగా పెరిగి వాటి వేర్లు నగరమంతా విస్తరించాయి. నేలపైకి కూడా చొచ్చుకుని వచ్చి అంతటా పరుచుకున్నాయి. అక్కడి రోడ్లకు ఇరువైపులా పాదచారుల కోసం వేసిన ఫూట్పాత్లు కూడా ఆ వేర్ల కారణంగా పగిలి దెబ్బతింటున్నాయి. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఫలితం ఉండటంలేదు.
దాంతో పేవ్మెంట్లు విరిగిపోయి నడవడానికి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. అలాంటిచోట్ల హైహీల్స్ వేసుకొని నడిస్తే కిందపడిపోయి గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే 1963లోనే అప్పటి నగర అటార్నీ హైహీల్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైనా హై హీల్స్ వేసుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం తీసుకోవాలి. ఇలా అనుమతి తీసుకుని హైహీల్స్‌తో నడుస్తూ పడిపోతే దానికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదు. బాధితులు ప్రభుత్వాన్ని నిందించకుండా, కోర్టులో దావా వేయకుండా ముందుగానే వారి నుంచి హామీ తీసుకుంటారు.
ఫైనల్‌గా మహిళల క్షేమాన్ని కోరే ప్రభుత్వం ఇలాంటి నిబంధన విధించిందనే విషయం స్పష్టమవుతోంది. అయితే తాను జాగ్రత్తగా నడుస్తూ పడిపోకుండా ఉంటాననే నమ్మకం ఉన్న మహిళల నుంచి, పడిపోయి గాయాలైనా పర్వాలేదు అనే తెగింపు ఉన్న మహిళల నుంచి మాత్రం ప్రభుత్వం ఆ మేరకు హామీ తీసుకుని అనుమతి మంజూరు చేస్తోంది.