పాట్నా, మే 27 : భారత్-నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న బీహార్‌లోని పలు జిల్లాల్లో డ్రోన్లు అలజడి సృష్టించాయి. సోమవారం రాత్రి 15-20 డ్రోన్లు భారత గగనతలంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో మంగళవారం బీహార్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మధుబని జిల్లాలో ఉన్న కమ్లా బోర్డర్ ఔట్‌పోస్ట్ వద్ద ఈ డ్రోన్లు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి అనంతరం నేపాల్ భాగంలోకి వెళ్లిపోయాయి.
సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డిప్యూటీ కమాండెంట్ వివేక్ ఓజా దర్బాంగ, ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు దీనిపై సమాచారం అందించారు. అనంతరం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. ‘మీరు ఏదైనా డ్రోన్ల విన్యాసం నిర్వహించారా?’ అని నేపాల్‌ను భారత్ దళాలు ప్రశ్నించగా, తాము అలాంటిదేమీ నిర్వహించ లేదని అక్కడి నుంచి సమాచారం వచ్చింది.