లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు యుద్ధరంగ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఏకకాలంలో వందలాది వైర్లెస్ పరికరాలను ఎలా పేల్చేశారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఈ దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. అయితే, ఈ దాడులకు ప్రణాళిక, అమలు అంతా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌కు చెందిన ‘యూనిట్ 8200’ పనేనని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పేలుళ్లపై ఏడాది కాలంగా ‘యూనిట్ 8200’ పని చేస్తున్నదని, 5,000 పేజర్లలో తయారీ సమయంలోనే చిన్న మొత్తంలో పేలుడు పదార్థాలు అమర్చిందని తెలుస్తున్నది.
అత్యాధునిక సాంకేతికతలపై పట్టుండే మెరికల్లాంటి యువతీ యువకులను ‘యూనిట్ 8200’కు ఎంపిక చేస్తారు. సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం దీనిని ఏర్పాటు చేసినా తర్వాత సాంకేతికత దాడులు, స్ట్రైక్స్ చేసేలా ఇజ్రాయెల్ మార్చింది. అధునాతన సాంకేతికతలను వినియోగించి ఎవరూ కలలో కూడా ఊహించని దాడులను ‘యూనిట్ 8200’ చేపట్టగలదట. ఇరాన్ అణు ప్రయోగాలను నిర్వీర్యం చేయడంలోనూ దీని పాత్ర ఉందనే కథనాలు ఉన్నాయి.