బీరుట్, సెప్టెంబర్ 19: పేజర్లు, వాకీటాకీలు పేల్చేయడం ఇజ్రాయెల్ చేపట్టిన ఉగ్రవాద చర్య అని హెజ్బొల్లా నాయకుడు హస్సన్ నస్రల్లా పేర్కొన్నారు. ఇది లెబనాన్ ప్రజలు, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధాన్ని ప్రకటించడమేనని అన్నారు. లెబనాన్‌లో హెజ్బొల్లా లక్ష్యంగా పేజర్లు, వాకీ టాకీలు పేలిన తర్వాత నస్రల్లా మొదటిసారి మాట్లాడారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడిందని, అన్ని హద్దులూ దాటిందని ఆయన పేర్కొన్నారు.
సాధారణ ప్రజలు ఉండే దవాఖానలు, మార్కెట్లు, దుకాణాలు, ఇండ్లు, వీధుల్లో ఇజ్రాయెల్ పేలుళ్లు జరిపిందని అన్నారు. ఇందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సాంకేతికంగా సహకరించిందని ఆరోపించారు. పేజర్ల పేల్చివేతతో నాలుగు వేల మందిని చంపాలని ఇజ్రాయెల్ ప్రయత్నించిందని అన్నారు. కాగా, పేజర్లు, వాకీ టాకీల పేలుళ్లలో 37 మంది మరణించారని, 287 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబైద్ తెలిపారు. విమానాల్లో పేజర్లు, వాకీ టాకీలపై లెబనాన్ నిషేధం విధించింది.
హెజ్బొల్లా నాయకుడు నస్రల్లా ప్రసంగించిన వెంటనే లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించాయి. హెజ్బొల్లా ఉగ్రవాద సామర్థ్యాలు, సదుపాయాలను నిర్వీర్యం చేసేందుకు దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో రక్షణను పటిష్టం చేయడమే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది.