బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తమ చీఫ్ హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మరణించినట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. బీరూట్‌లోని గ్రూప్ ప్రధాన కార్యాలయంపై జరిగిన భారీ దాడిలో హసన్ నస్రల్లాతోపాటు మరో టాప్ కమాండర్ అలీ కరాకి చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ పేరుతో చేపట్టిన దాడుల్లో శక్తివంతమైన 64 ఏళ్ల ఇస్లామిస్ట్ నాయకుడిని చంపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం ప్రకటించింది.
కాగా, లెబనాన్‌లో ఆధిపత్యమున్న హిజ్బుల్లా చాలా ఆలస్యంగా దీనిపై స్పందించింది. ‘తోటి అమరవీరులతో నస్రల్లా చేరారు’ అని అధికారికంగా ప్రకటించింది. మరో టాప్ కమాండర్ అలీ కరాకి మృతదేహంతో పాటు నస్రల్లా మృతదేహాన్ని గుర్తించినట్లు హిజ్బుల్లా అధికారి తెలిపారు. అలాగే నస్రల్లా మరణానికి సంతాపంగా హిజ్బుల్లాకు చెందిన అల్-మనార్ టీవీలో ఖురాన్ పద్యాలను ప్రసారం చేశారు.
మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతోపాటు ఆయన కుమార్తె జైనాబ్ నస్రల్లా, హిజ్బుల్లా సదరన్ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ డిప్యూటీ కమాండర్ అబ్బాస్ నిల్ఫోరౌషన్ కూడా మరణించారు. అయితే ఇజ్రాయెల్‌పై తమ పోరాటం కొనసాగుతుందని ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా స్పష్టం చేసింది. ‘పాలస్తీనా, గాజాకు మద్దతుగా లెబనాన్, దాని దృఢమైన, గౌరవమైన ప్రజల రక్షణ కోసం ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది.