Heavy Snowfall @ America | అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తున్నది. పశ్చిమ న్యూయార్క్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. తీవ్రమైన మంచు కారణంగా న్యూయార్క్‌లో ఇద్దరు చనిపోయారు. కొన్ని చోట్ల 6 అడుగులకు పైగా మంచు పేరుకుపోయింది. రానున్న 24 గంటల్లో న్యూయార్క్‌లో అత్యధిక హిమపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చిరంచారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
అమెరికాలోని చాలా ప్రాంతాలు మంచు దుప్పట్లో మునిగిపోయాయి. ప్రధాన నగరాల్లో మంచు భారీగా కురుస్తుండటంతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ బఫెల్లో ప్రాంతంలో మంచు తుఫాన్ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇక్కడ 6 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రోడ్లన్నీ మూతపడ్డాయి. దాంతో వాహనాల డ్రైవింగ్‌ను అధికారులు నిషేధించారు. చాలా విమానాలు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాహానాలను బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
వెస్ట్రన్ న్యూయార్క్‌లోని పలు ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌లు పగలు, రాత్రి పని చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 280 మందిని రక్షించారు. దాదాపు 1,600 మంది విద్యుత్తు లేకుండా జీవిస్తున్నారు. మంచు కురిసే ప్రాంతాల్లో రోడ్లు, ముఖ్యమైన ప్రదేశాల్లోని మంచును తొలగించే పనిని ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టారు. భారీ హిమపాతం కారణంగా ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది.