ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ స్థావరాలకు భారీ నష్టం వాటిల్లిందని, 13 సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొన్నది. అమెరికా అధికారులు, సైనిక సిబ్బందిని ఉటంకిస్తూ ఈ కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం, ‘సైనిక స్థావరాలు ధ్వంసం కావటంతో వేలాది మంది సైనికులు హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లారు. యుద్ధ భూమిలో అమెరికా సైన్యం చెల్లాచెదురైంది. గల్ఫ్‌లో మిగిలిన సైనిక స్థావరాలను కూడా అమెరికా దీర్ఘకాలం కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయి’ అని పేర్కొన్నది.
ఇందులో కొందరిని యూరప్ వరకు తరలించటంతో, అమెరికా పూర్తిస్థాయి సైనిక ఆపరేషన్‌పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇరాన్లో 7,000కుపైగా టార్గెట్ దాడులు చేశామని అమెరికా రక్షణమంత్రి హెగ్సెత్ చెప్పటం గమనార్హం. ఇరాన్ మిలిటరీ, ఆయుధ స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా సైనికులకు ఆశ్రయం ఇస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.