Mini Brain | స్టాక్హోమ్, డిసెంబర్ 6: మెదడు నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా గుండె పని చేస్తుందనేది ఇప్పటివరకు వైద్యులు విశ్వసిస్తున్న విషయం. అయితే, గుండె తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. స్వీడన్లోని కరోలిన్స్క ఇన్స్టిట్యూట్, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు. మనుషుల శరీరతత్వంతో పోలికలు ఉండే జీబ్రాషిఫ్పై వీరు నిర్వహించిన అధ్యయనం వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనం ప్రకారం… ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే, గుండెలో సంక్లిష్టమైన న్యూరాన్ల వ్యవస్థ ఉందని పరిశోధకులు గుర్తించారు. ‘మినీ బ్రెయిన్’గా పరిశోధకులు పేర్కొంటున్న ఈ వ్యవస్థనే హృదయ స్పందనను నియంత్రిస్తున్నది. ఎలాగైతే కదలికలు, ఊపిరి తీసుకోవడాన్ని మెదడు క్రమబద్ధీకరిస్తుందో, అలాగే ఈ గుండెలోని మినీబ్రెయిన్.. హృదయ స్పందనను నియంత్రిస్తున్నది. అరిథ్మియా వంటి గుండె సంబంధ వ్యాధుల చికిత్సకు తమ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.