Han Kang | స్టాక్‌హోమ్: దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి హన్ కాంగ్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది. ఈ మేరకు గురువారం స్వీడిష్ అకాడమీ నోబెల్ కమిటీ ప్రకటించింది. ‘చారిత్రక విషాదాలను, మానవ జీవిత దుర్బలత్వాన్ని ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారు’ అని పేర్కొన్నది. హాన్ కాంగ్(53) ‘ది వెజిటేరియన్’ అనే నవలకు గానూ 2016లో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను గెలుపొందారు.
ఆమె మరో నవల ‘హూమన్ యాక్ట్స్’ 2018లో బుకర్ ప్రైజ్ పోటీలో ఫైనల్‌కు చేరింది. కాగా, సాహిత్యంలో నోబెల్ పురస్కారాలు ఎక్కువగా ఐరోపా, ఉత్తర అమెరికా రచయితలకే దక్కుతున్నాయనే విమర్శలు ఇంతకాలం ఉండేవి. ఇందులోనూ మగవారి ఆధిపత్యం ఉంటున్నదని, ఇప్పటివరకు 119 మందికి ఈ పురస్కారం దక్కగా, ఇందులో మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు.
హన్ కాంగ్‌ను ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేయడం ద్వారా ఈ విమర్శలకు నోబెల్ కమిటీ చెక్ పెట్టినట్టయ్యింది. నోబెల్ పురస్కారం కింద హన్ కాంగ్‌కు రూ.8.4 కోట్లు దక్కనున్నాయి. డిసెంబరు 10న ఆమె ఈ పురస్కారాన్ని అందుకుంటారు.