గాజా: ఇటీవల ఇజ్రాయిల్ జరిపిన డ్రోన్ అటాక్‌లో.. హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 7వ తేదీన జరిగిన అటాక్‌కు చెందిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ అటాక్‌కు ముందు సిన్వర్ తన ఫ్యామిలీతో కలిసి టన్నెల్స్ నుంచి వెళ్తున్న సమయంలో తీసిన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. హమాస్ చీఫ్ సిన్వర్ తన భార్య(Sinwars wife ), పిల్లలతో కలిసి వెళ్లాడు. నీళ్లు, తలదిండు, మంచాలను తమతో తీసుకెళ్లారు. టన్నెల్‌కు పారిపోయే ముందు ఓ టెలివిజన్ సెట్‌ను కూడా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖాన్ యూనిస్‌లో ఉన్న ఇంటి వద్ద అతను టన్నెల్లో కనిపించాడు.
సిన్వర్ భార్య టన్నెల్ నుంచి వెళ్తున్న దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ సమయంలో ఆమె వద్ద ఖరీదైన చేతి బ్యాగును గుర్తించారు. హెర్మెస్ బ్రాండ్‌కు చెందిన ఆ బ్యాగు ఖరీదు సుమారు 26 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హమాస్ వల్ల గాజా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, సిన్వర్ కుటుంబం మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. హెర్మెస్ బ్యాగుతో వెళ్తున్న సిన్వర్ భార్య ఫోటో స్క్రీన్‌షాట్‌ను ఇజ్రాయిల్ షేర్ చేసింది. ఆ బ్యాగు డిజైన్ హెర్మెస్ బిర్కిన్ 40 బ్లాక్ టోగో గోల్డ్ హార్డ్‌వేర్ ఎడిషన్‌కు చెందినట్లు భావిస్తున్నారు. ఇజ్రాయిల్ చేసిన ఆరోపణలను ఇంత వరకు పాలస్తీనా ద్రువీకరించలేదు.