టెల్అవీవ్, అక్టోబర్ 10 : ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. చర్చల్లో పేర్కొన్న విధంగా మోహరించిన తమ దళాలు వెనుదిరుగుతున్నట్టు ఐడీఈ ఎక్స్‌లో తెలిపింది. కాగా, సదరన్ కమాండ్‌లో మోహరించిన ఐడీఈ దళాలు మాత్రం కొనసాగుతూ ఏదైనా ముప్పు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులతో స్వస్థలాలను వీడిన పాలస్తీనీయులు తిరిగి వెనక్కి వస్తున్నారు. ఒప్పందంలో భాగంగా హమాస్‌కు 72 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆ డెడ్‌లైన్ లోగా హమాస్ తన వద్ద ఉన్న బందీలందరినీ ఇజ్రాయెల్‌కు అప్పగించాల్సి ఉంది.
ప్రస్తుతం ఐడీఈ దళాల ఆధీనంలో 53 శాతం గాజా ప్రాంతం ఉంది. కాగా, హమాస్ చేతిలో ఉన్న బందీలందరూ సజీవంగానే ఉన్నారని భావిస్తున్నామని, వారిని సోమవారం మధ్యాహ్నం 12 గంటలలోగా అప్పగించాల్సి ఉందని ఇజ్రాయెల్ అధికారి పేర్కొన్నారు. ఇంతకు ముందు జరిగిన అప్పగింత రెడ్‌క్రాస్ చేతుల మీదుగా జరిగింది. ఒప్పందంలో భాగంగా 28 మంది బందీల మృతదేహాలను కూడా అప్పగించాల్సి ఉంది. అయితే దీనిని ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో జీవిత ఖైదును అనుభవిస్తున్న 250 మంది పాలస్తీనావాసులు, గాజా నుంచి 1700 మంది ఖైదీలను కూడా విడుదల చేయాల్సి ఉంది.