Ismail Haniyeh | బీరుట్, జూలై 31: ఇజ్రాయెల్‌తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపునకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై బుధవారం తెల్లవారక ముందు 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతోపాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా.. దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇజ్రాయెలే హనియాను హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపించాయి. అయితే హనియా హత్యపై స్పందించేందుకు ఇజ్రానిరాకరించింది. హత్యలో తమ ప్రమేయం లేదని అమెరికా పేర్కొన్నది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హనియా ప్రతీకారాన్ని తమ డ్యూటీగా తీసుకొంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కఠిన శిక్షకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
హనియా హత్య పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉన్నదని ఈజిప్టు అభిప్రాయపడింది. హత్యపై సమగ్ర విచారణ జరపాలని మలేషియా కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు తక్షణం శాంతియుత మార్గంలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సిన అవసరాన్ని ఈ ఘటన చెబుతున్నదని పేర్కొన్నది. ఇలా దాడులు, హత్యలకు పాల్పడుతుంటే మధ్యవర్తిత్వం ఎలా సక్సెస్ అవుతుందని ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అల్ థాని అన్నారు. ఈ రాజకీయ హత్య ఆమోదనీయం కాదని రష్యా పేర్కొన్నది.
హనియా 1963లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్ గ్రూపులో చేరగా.. 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనియా.. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించిన తర్వాత గ్రూపులో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికైన హనియాను.. అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఆయన గాజా స్ట్రిప్‌ను వీడి ఖతార్‌లో నివాసం ఉంటున్నాడు.