బీజింగ్: చైనాలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ సీనియర్ ఆరోగ్యాధికారి బో తావో ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్డావో నగరంలో ప్రతి రోజూ సుమారు 5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆ అధికారి చేసిన ప్రకటనను చైనా ప్రభుత్వం ఖండించింది. దీంతో ఆ దేశంలో సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలియడం లేదని నిపుణులు భావిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం చైనాలో లాక్డౌన్ ఎత్తివేశారు. క్వారెంటైన్లు, ప్రయాణ ఆంక్షలను కూడా తొలగించారు. దీంతో చైనాలోని పలు నగరాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంలో ప్రభుత్వ వర్గాలు ఇబ్బందిపడుతున్నాయి. హాస్పిటల్ వార్డులు నిండిపోయాయి. శ్మశానవాటికల్లోనూ క్యూలైన్ ఉంటోంది. ఓ ప్రావిన్సులో మార్చి నాటికి 4 కోట్ల మంది వైరస్ సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.