వాషింగ్టన్: 2023 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియ మార్చి 23 వరకు కొనసాగుతుందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుదారులు, ప్రతినిధులు గడువులోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి సమర్పించాలని తెలిపింది. మార్చి 18 నాటికి తగినంత సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వస్తే, ర్యాండంగా రిజిస్ట్రేషన్లను ఎంచుకుని, వినియోగదారుల myUSCIS ఆన్లైన్ ఖాతాల ద్వారా నోటిఫికేషన్ పంపుతామని డిపార్ట్మెంట్ పేర్కొంది.
అర్హత గల H-1B క్యాప్-సబ్జెక్ట్ దరఖాస్తుదారులు, లేదా వారి ప్రతినిధులు ఎంపిక ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేసుకోవడానికి myUSCIS ఆన్లైన్ ఖాతాను ఉపయోగించాలి. ప్రతి లబ్ధిదారుని తరపున సమర్పించిన ప్రతి రిజిస్ట్రేషన్ కోసం సంబందిత పది డాలర్ల H-1B రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఒక కన్ఫర్మేషన్ నంబర్‌ను కేటాయిస్తుంది. అయితే ఈ నంబర్ దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ల స్థితిని ట్రాక్ చేయడానికి కాదు.
మరోవైపు స్వంత రిజిస్ట్రేషన్లను సమర్పించే సంస్థలు (అమెరికా యజమానులు, ఏజెంట్లను సమిష్టిగా “రిజిస్ట్రెంట్‌లు” అని వ్యవహరిస్తారు) తమ “రిజిస్ట్రన్” ఖాతాను ఉపయోగింస్తారు. ఈ విధంగా నమోదు చేసుకున్నవారు ఫిబ్రవరి 21 మధ్యాహ్నం నుంచి కొత్త ఖాతాలను తెరువవచ్చు.
H-1B వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ప్రత్యేక వృత్తులు, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఇది అనుమతిస్తుంది. అమెరికా ఐటీ సంస్థలు ఎక్కువగా భారతీయులను నియమించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. దీంతో ఈ వీసా కోసం భారతీయుల టెక్కీలు ఎక్కువగా పోటీపడుతుంటారు. అమెరికాలో అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం కోసం 65,000 H-1B వీసాలు జారీ చేస్తారు. అమెరికా మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం 20,000 వీసాలను రిజర్వ్ చేస్తారు.
మరోవైపు కరోనా పరిస్థితుల నేపథ్యంలో H-1B వీసా దరఖాస్తుదారులకు గత ఏడాది డిసెంబర్లో నిర్వహించాల్సిన వ్యక్తిగత ఇంటర్వ్యూలను అమెరికా రద్దు చేసింది. అలాగే కరోనా మహమ్మారి వల్ల
2021లో H-1B వీసాల సంఖ్య ఒక దశాబ్దం కనిష్ఠానికి పడిపోయింది.