వాషింగ్టన్ : 2025తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నూతన నియామకాల కోసం భారత దేశం నుంచి కార్యకలాపాలు నిర్వహించే అగ్రశ్రేణి ఏడు ఐటీ కంపెనీలకు కేవలం 4,573 హెచ్-1బీ పిటిషన్లకు మాత్రమే ఆమోదం లభించింది. 2015తో పోల్చుకుంటే 70 శాతం తగ్గిపోగా, 2024తో పోల్చినపుడు 37 శాతం తగ్గింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫేపీ) ఈ వివరాలను వెల్లడించింది. ఇండియన్ ఐటీ ఫర్మ్స్ తక్కువ హెచ్-1బీ వీసాలను వాడుకుంటున్నాయని, అమెరికన్ కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ)లో కోట్లాది డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలో ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం తాజా గ్రాడ్యుయేట్లతోపాటు విదేశీ ప్రతిభావంతులను అమెరికన్ కంపెనీలు నియమించుకుంటున్నట్లు తెలిపారు. నిరంతరాయంగా ఎంప్లాయ్మెంట్ అప్రూవల్స్ పొందుతున్న టాప్ 5 కంపెనీల్లో టీసీఎస్ మాత్రమే ఏకైక ఇండియన్ ఐటీ కంపెనీ. అయితే, ఈ కంపెనీ సమర్పించిన పిటిషన్ల తిరస్కరణ రేటు 2024లో 4 శాతం కాగా, 2025లో 7 శాతానికి పెరిగింది.
టీసీఎస్ ఈ ఏడాది ఉద్యోగాల కొనసాగింపు కోసం 5,293 అప్రూవల్స్ పొందింది. అదేవిధంగా, ఇనీషియల్ ఎంప్లాయ్మెంట్ కోసం 846 అప్రూవల్స్ పొందింది. నిరుడు ఈ సంఖ్య 1,452. అంటే, అప్రూవల్స్ బాగా తగ్గిపోయాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇనీషియల్ ఎంప్లాయ్మెంట్ కోసం హెచ్-1బీ పిటిషన్ల ఆమోదం పొందిన టాప్ 25 కంపెనీల్లో భారతీయ కంపెనీలు మూడు మాత్రమే ఉన్నాయి. ఇనీషియల్ హెచ్-1బీ అప్రూవల్స్‌లో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ అగ్ర స్థానంలో ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇనీషియల్ ఎంప్లాయ్మెంట్ కోసం అమెజాన్‌కు 4,644 హెచ్-1బీ పిటిషన్లకు ఆమోదం లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో మెటా ప్లాట్‌ఫామ్స్ (1,555), మైక్రోసాఫ్ట్ (1,394), గూగుల్ (1,050) ఉన్నాయి. ఈ క్యాటగిరీలో తొలి నాలుగు స్థానాల్లో అమెరికా కంపెనీలు నిలవడం ఇదే మొదటిసారి.