Nizamuddin : పాస్‌పోర్టు (Passport) లో ఇంటిపేరు లేదనే కారణంతో ప్రయాణికుడిని విమానంలోకి అనుమతించలేదు. తాను ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరుకావాల్సి ఉందన్నా పట్టించుకోలేదు. భారత్ (India) నుంచి మాస్కో (Mascow) కు వచ్చేటప్పుడు పాస్‌పోర్టుపై ఆ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అభ్యంతరం తెలుపలేదన్నా వినిపించుకోలేదు. దాంతో అతడు ఎయిర్‌లైన్స్‌పై న్యాయపోరాటం చేశాడు. చివరికి విజయం సాధించాడు.
మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన నిజాముద్దీన్ చెన్నైలోని వినియోగదారుల కమిషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రకారం.. 2023, ఫిబ్రవరి 9న ఒక సమావేశం నిమిత్తం గల్ఫ్ ఎయిర్ఫ్లైట్లో మాస్కో నుంచి దుబాయ్ వెళ్లేందుకు నిజాముద్దీన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తన పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకుండా సింగిల్ నేమ్ ఉందని మాస్కో ఎయిర్‌పోర్టులో గల్ఫ్ ఎయిర్‌ఫ్లైట్ సిబ్బంది బోర్డింగ్‌ను నిరాకరించారు.
దుబాయ్‌లో సమావేశం ఉందని చెప్పినా వారు పట్టించుకోలేదు. గంటన్నరపాటు వేచిచూసేలా చేశారు. ఈ జాప్యంవల్ల గమ్యస్థానం చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిజాముద్దీన్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్.. అదేపేరుతో భారత్ నుంచి మాస్కో ప్రయాణానికి అనుమతి లభించిందని, మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎదురైందని గుర్తించింది.
ఈ కేసులో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిబంధనలను పాటించలేదని కమిషన్ నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు నిజాముద్దీన్‌కు పరిహారం చెల్లించాలని తాజాగా గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. టికెట్ ఖర్చు, సేవల్లో లోపం, ఆర్థికనష్టంతోపాటు ఆయన అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ.1.4 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రయాణ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది.