Kharg Island : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అమెరికా సంచలన చర్యకు దిగింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ‘ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)’ ను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ దీవి నుంచే జరుగుతాయి. ఈ మెరుపుదాడితో ఇరాన్ ఆర్థిక మూలాలను అమెరికా (USA) గట్టిగా దెబ్బతీసినట్లయింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అమెరికా వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను పూర్తిచేసినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో ఇరాన్ భూభాగంలోకి సైన్యాన్ని పంపేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే పశ్చిమాసియాకు అదనపు బలగాలను తరలిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అమెరికా నేరుగా ఇరాన్ గడ్డపైకి సైన్యాన్ని పంపాలని నిర్ణయించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇరాన్ అనుకూల వర్గాలు చేసిన దాడులకు ప్రతిగా అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ఆ మార్గాన్ని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు అమెరికా దళాలు భీకరంగా పోరాడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.