వాషింగ్టన్, జనవరి 19: ఇంటర్నెట్లో సమాచార శోధనను మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ తన ప్రీమియం డివైజ్‌లలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే రెండు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటిలో ‘సర్కిల్ టు సెర్చ్’, ‘లెన్స్’ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్‌పై కనిపించే ఫొటో, వీడియో, టెక్స్పై వృత్తాన్ని (సర్కిల్‌ను) గీయడం, హైలైట్, స్క్రిబిల్ చేయడం ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘సర్కిల్ టు సెర్చ్’ ఫీచర్ ఉపకరిస్తుంది.
బుధవారం విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్-24 సిరీస్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో సహా ఇతర ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నట్టు గూగుల్ స్పష్టం చేసింది. ‘లెన్స్’ ఫీచర్ ద్వారా ఫోన్ కెమెరాలో ఏదైనా వస్తువును లేదా ప్రదేశాన్ని కవర్ చేస్తూ దానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్ననైనా అడిగి సమాచారాన్ని పొందవచ్చు. ఫొటోలు లేదా స్క్రీన్షాట్లను అప్లోడ్ చేయడం ద్వారా కూడా వాటి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.