వాషింగ్టన్: గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico) పేరును గూగుల్ మ్యాప్స్ ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికాగా చూపించనుంది. ఈ నెల 25న గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చుతూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గూల్స్ మ్యాప్స్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఇది అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే కనిపిస్తుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోగానే ఉంటుందని స్పష్టం చేసింది. అధికారికంగా అప్డేట్లు వచ్చినప్పుడు తాము కూడా మార్పులు చేస్తామని తెలిపింది.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారిందని ట్రంప్ కార్యవర్గం గత శనివారం ప్రకటించింది. అదేవిధంగా అమెరికాలోని ఎత్తయిన అలస్కన్ శిఖరం డెనాలిని మౌంట్ మెకిన్లీగా మార్చామని తెలిపింది. ఈ మార్పులు అమెరికా అసాధారణ వారసత్వాన్ని కాపాడటంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఆమెరికా చరిత్రను భవిష్యత్ అమెరికన్లు సంబురంగా జరుపుకుంటారని పేర్కొంది.
ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సుముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఈ ప్రదేశం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జలవనరు. తొలిసారి ఈ పేరును 16వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన అన్వేషకులు వినియోగించారు. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే లభిస్తుంది. కాగా, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పును తొలి నుంచి మెక్సికో వ్యతిరేకిస్తున్నది.
ఇక, అలస్కా శిఖరాన్ని గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం మెకిన్లీ గౌరవార్థం మౌంట్ మెకిన్లీ అని పిలిచేవారు. ఆ తర్వాత 1975లో రాష్ట్ర అభ్యర్థన మేరకు దానిని డెనాలిగా మార్చారు. డెనాలి అంటే కోయుకాన్ భాషలో ఎత్తు అని అర్ధం.