వాషింగ్టన్: కెరీర్ అవకాశాల అన్వేషణకు ఉపయోగపడే ఆన్లైన్ టూల్ కెరీర్ డ్రీమర్ను గూగుల్ ప్రారంభించింది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగాలు, కంపెనీలను మార్చుకోవాలనుకునేవారు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు. తమ వృత్తిపరమైన ప్రయాణంలో, ఉద్యోగాల గురించి సమాచారం తెలుసుకుని, నిర్ణయాలు తీసుకోవడానికి కెరీర్ డ్రీమర్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా యూజర్లు తమ నైపుణ్యాలకు తగిన కెరీర్ మార్గాలను గుర్తించగలుగుతారు.వాస్తవ ప్రపంచంలో తమకు తగిన ఉద్యోగాల గురించి అవగాహన చేసుకోగలుగుతారు.
యూజర్లు కెరీర్ డ్రీమర్ టూల్‌ను సందర్శించినపుడు, స్టార్ట్పై క్లిక్ చేయాలి. ప్రస్తుత, అంతకు ముందరి ఉద్యోగాలు, సంస్థల గురించి వివరించమని అడుగుతుంది. ఈ సమాచారం ఆధారంగా, వారు నిర్వహించిన లక్ష్యాలు(టాస్క్‌లు), తమకు నమ్మకం గల నైపుణ్యాలను ఎంపిక చేసుకోవాలని చెప్తుంది. దీని ఆధారంగా కెరీర్ డ్రీమర్ ఓ కెరీర్ ఐడెంటిటీ స్టేట్మెంట్ను తయారు చేస్తుంది. యూజర్‌కు గల వృత్తి పరమైన బలాలు, అనుభవాలను సంగ్రహంగా పొందుపరుస్తుంది.
యూజర్ ప్రొఫైల్‌కు అనుగుణంగా రకరకాల కెరీర్ మార్గాలను ఈ టూల్ సూచిస్తుంది. ఈ విధంగా సూచించిన ప్రతి ఉద్యోగానికి సగటు జీతం, విద్యార్హతలు వంటివాటిని వివరిస్తుంది. ఉద్యోగం చేస్తూ దృష్టి పెట్టాల్సిన అంశాలతో ‘స్వీట్ స్పాట్’ సెక్షన్ కూడా ఉంటుంది. ఆ ఉద్యోగంలో ఒక రోజు ఏవిధంగా ఉంటుందో వివరించే ‘ఏ డే ఇన్ ది లైఫ్’ ఓవర్ వ్యూ సెక్షన్ కూడా ఉంటుంది.