El Nino effect | నార్విచ్ (బ్రిటన్): పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై ఏర్పడిన ‘ఎల్ నినో’ ప్రపంచ మానవవాళికి సరికొత్త సవాల్‌ను విసురుతున్నది. పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకూడదన్నది పారిస్ ఒప్పందంలో ముఖ్య లక్ష్యం. కానీ దీనికి ఎల్‌నినో పెద్ద దెబ్బకొట్టనున్నది. సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను దాటడం 2024లోనే సంభవిస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఇది 2 డిగ్రీల సెల్సియస్‌కు కూడా చేరుకుంటుందని, దీంతో భూ వాతావరణం మరింత వేడెక్కుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో కారణంగా రుతు పవనాల గమనం దెబ్బతినటం, కరువు, కాటకాలు, కుండపోత వర్షాలు, అడవుల్లో కార్చిచ్చు..మొదలైనవి ఇప్పటికే అనుభవంలోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనున్నదని, ఆహార పంటల దిగుబడి తగ్గే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు.
యూరప్‌పై తీవ్ర ప్రభావం
ఎన్నోవేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరప్ ఉత్తర ప్రాంతంపైనా ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ ఏడాది తీవ్రమైన చలి, పొడి వాతావరణం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేయనున్నది. అనూహ్యమైన వాతావరణ మార్పులతో యూరప్ వాసులు జాగ్రత్త పడాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ జెట్ స్పీడ్‌తో వీచే రాస్బై వేవ్స్ అల్లకల్లోలం రేపనున్నాయి. ఇది హిందూ మహాసముద్రంపైకి విస్తరిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఏమిటీ ఎల్‌నినో?
సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్‌నినో వర్షాభావ పరిస్థితిని వివరిస్తుంది. లానినో విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితిని వివరిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్ నినో, లా నినోలకు కారణం అవుతున్నాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ (ఈఎన్ఎస్వో) వలయాలు అంటారు. ఈఎన్ఎస్వో ఉష్ణదశను ఎల్‌నినో అని, చలి దశను లా నినో అని పేర్కొంటారు. ఎల్‌నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతున్నది. ఈ పెరుగుదల ఒక్కోసారి 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉండవచ్చు. దీనివల్ల సముద్రం, దానిపైన ఆవరించిన వాతావరణం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతుంది.