Global Warming | ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్నది. ఇది కేవలం వాతావరణ సంక్షోభం మాత్రమే కాకుండా మానవ ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ సెల్సియస్ పెరిగినా.. ఒక్కో వ్యక్తికి ప్రతిరోజూ లభించే ఆహారంలో సగటున 120 క్యాలరీలు తగ్గిపోతాయట. ఇది మన రోజువారీ ఆహార వినియోగంలో సుమారు 4.4శాతం తక్కువ. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. శతాబ్దం చివరినాటికి ప్రధాన పంటల నుంచి వచ్చే క్యాలరీల పరంగా 24 శాతం వరకు తగ్గిపోవచ్చని హెచ్చరిస్తున్నది. ఇది ఇప్పటికే ఆకలితో బాధపడుతున్న కోట్లాది మంది ప్రజల పరిస్థితిని మరింత దయనీయంగా మార్చనున్నదని నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీతో సహా ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థలుకలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అధ్యయనం ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ సోలమన్ హ్సియాంగ్ మాట్లాడుతూ.. ‘ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగితే.. ప్రపంచం మొత్తం ఉదయం భోజనం మానేసినట్టే అవుతుంది’ అన్నారు. ఈ ప్రభావం అత్యధికంగా తక్కువ ఆదాయ గల దేశాలపై ఉండనుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికే ఉన్న పోషకాహార లోపం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. ఈ ప్రభావం అత్యధికంగా పేదలపై ఉంటుందని.. ఇప్పటికే 80కోట్ల మంది పోషకాహారం లోపంతో బాధపడుతుండగా.. వారి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధ్యయనం కేవలం శాస్త్రవేత్తలు, పాలసీ మేకర్లకే కాకుండా ప్రతిరోజూ రెండుపూటలా భోజనం చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ హెచ్చరికలాంటిదన్నారు.
ప్రసుతం మొక్కజొన్న, సోయాబిన్ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న అమెరికా మిడ్వెస్ట్ భవిష్యత్లో అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉండనుందని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పు ఉష్ణోగ్రతలో తీవ్ర పెరుగుదల, వర్షపాత నమూనాలలో అస్థిరత, వేడిగాలుల ఫ్రీక్వెన్సీ పెరుగుదలకు కారణమవుతుందని భావిస్తున్నారు. దాని కారణంగా నేల తేమ తగ్గుతుంది. పరాగసంపర్కం ప్రక్రియ దెబ్బతింటుంది. పంటలు ముందుగానే వాలిపోవడం లేదంటే ఎండిపోవడం జరుగుతుంది. అదే సమయంలో కెనడా, రష్యా, చైనా వంటి చల్లని దేశాలలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
2025 నాటికే ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా పంట ఉత్పత్తి 8 శాతం వరకు తగ్గిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది కార్బన్ ఎమిషన్లు తగ్గినా.. పెరిగినా ఇదే జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే కార్బన్ డై ఆక్సైడ్ వంటి హానికర వాయువులు వందల ఏళ్ల పాటు వాతావరణంలో ఉండడమే కారణం. వాతావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికత, నిధులు సమకూర్చడం, ప్రభుత్వ సహాయంతో రైతులకు మద్దతు ఇచ్చినట్లయితే ఈ నష్టాన్ని కొంత మేరకైనా తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇది సాధ్యపడాలంటే ప్రపంచవ్యాప్తంగా స్థాయిలో పాలసీ తీసుకురావడంతో పాటు తక్షణ చర్యలు, కఠిన నిర్ణయాలు అవసరమని నిపుణులు స్పష్టం చేశారు.