Donald Trump : అమెరికా (USA) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) మాజీ చీఫ్ రాబర్ట్ ముల్లర్ III (Robert S Mueller III) మరణించడంపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆనందం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘రాబర్ట్ ముల్లర్ III చనిపోయారు. ఆయన మృతి చెందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆయన అమాయకులను ఇబ్బంది పెట్టలేరు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
కాగా 81 ఏళ్ల రాబర్ట్ ముల్లర్ పార్కిన్సన్ వ్యాధితో శుక్రవారం చనిపోయినట్లు ఆయన కుటుంబం ప్రకటించింది. ఆ ప్రకటన అనంతరం ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఎఫ్‌బీఐలో చేరిన రాబర్ట్ 12 ఏళ్లపాటు ఆ విధుల్లో కొనసాగారు. రాబర్ట్ నాయకత్వంలో ఎఫ్‌బీఐ దేశీయ నేరాలను పరిష్కరించడంతోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2016లో తొలిసారి ఎన్నికైనప్పుడు ట్రంప్ విజయానికి రష్యా సాయమందించిందని ఆరోపణలు వచ్చాయి.
ట్రంప్ విజయానికి రష్యా సహకారం అంశంపై అమెరికా న్యాయశాఖ జరిపిన విచారణలో రాబర్ట్ ప్రత్యేక న్యాయ సలహాదారుగా పనిచేశారు. దాంతో ఆయనను ట్రంప్ పాలకవర్గం చాలాసార్లు బహిరంగంగా విమర్శించింది.