వాషింగ్టన్, జూలై 22: భారత సంతతి అమెరికన్ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ)ను వీడుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఈమేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థలో ఏడేండ్లపాటు సాగిన తన ప్రయాణం అద్భుతమని, తన జీవితకాలంలో లభించిన గొప్ప అవకాశమని అన్నారు. అయితే తాను ఇకపై విద్యావేత్తగా అకడమిక్స్ వైపు వెళ్లాలనుకుంటున్నానని ఆమె తెలిపారు.
సెప్టెంబర్ 1న హార్వర్డ్ ఎకనమిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఆమె చేరబోతున్నట్టు తెలిసింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్, మైక్రో ఎకనమిక్స్‌లో పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా 2019 జనవరిలో ఆమె ఐఎంఎఫ్‌లో బాధ్యతలు అందుకున్నారు.