Giorgia Meloni : అమెరికా, ఇటలీ దేశాధినేతల మధ్య ఒక కొత్త వివాదం తలెత్తింది. తనతో ఫొటో దిగాలని ఉందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అడుక్కుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటనను మెలోని ఖండించారు. అదో కట్టుకథ అంటూ కొట్టిపారేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జీ7 దేశాల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఇండియా ప్రధాని మోదీతోపాటు డొనాల్డ్ ట్రంప్, జార్జియా మెలోని పాల్గొన్నారు. ఈ సదస్సుపై డొనాల్డ్ ట్రంప్ ఒక ఇటలీ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగాలని ఎంతో ఆశపడ్డట్లు తెలిపారు. దీనిపై మెలోని తనను బ్రతిమాలిందని వివరించారు.
అయితే, తాను ఆమెతో ఫొటో దిగలేకపోయానని, ఇందుకు తనను క్షమించాలని కోరుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాను మెలోనితో మాట్లాడినందుకు ఆమె సంతోషపడి ఉంటారని ట్రంప్ అన్నారు. దీంతో ట్రంప్ కామెంట్లపై ఇటలీలో రాజకీయ దుమారం రేగుతోంది. దేశ ప్రధాని ట్రంప్‌ను ఫొటో అడగటం ఏంటని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ అంశంపై నేరుగా ప్రధాని జార్జియా మెలోని స్పందించారు. ట్రంప్‌పై మండిపడుతూ, ఆయన ప్రకటనను ఖండించారు. తాను కానీ, ఇటలీ కానీ ఎవరినీ అడుక్కోదని మెలోని అన్నారు. ఈ మేరకు వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘‘ట్రంప్ ప్రకటన పూర్తిగా కల్పితం. ఆయన మాటలపై నేను దిగ్భ్రాంతి చెందాను. తన మిత్రదేశాలతో అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే తెలియడం లేదు. అయినా, ట్రంప్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. ట్రంప్ ఇదే తరహా అంకితభావాన్ని పశ్చిమ దేశాల శతృదేశాలపై మాత్రం చూపించలేడని నేను చెప్పగలను. పైగా అమెరికా శతృదేశాలపై ఆయన ఎంతో అనుకూలంగా ఉంటారు. కానీ, ట్రంప్ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. నేనుకానీ, ఇటలీకానీ.. ఎప్పుడూ, ఎవరినీ అడుక్కోదు’’ అంటూ మెలోని చెప్పుకొచ్చారు.
అయితే, ట్రంప్ చేసిన ప్రకటన అక్కడ రాజకీయంగా దుమారం రేపుతోంది. చాలా మంది నేతలు జార్జియా మెలోనికి మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో ఇటలీ ఉప ప్రధాని అంటోనియో తజాని కూడా ట్రంప్ ప్రకటనను ఖండిచారు. మరో రెండు రోజుల్లో చేపట్టాల్సి ఉన్న అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా, ఇటలీ ఒకప్పుడు అత్యంత మిత్ర దేశాలు. ఇప్పటికీ మిత్ర దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ అనేక అంశాల్లో పలు విబేధాలు తలెత్తాయి.