Germany| న్యూఢిల్లీ: నిపుణులైన భారత ఉద్యోగులను ఆకర్షించేందుకు జర్మనీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. సుశిక్షితులైన నర్సులపై ప్రధానంగా దృష్టిసారించింది. జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ, జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ 2022 నుంచి కేరళ నర్సులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. జర్మనీలో వైద్య రంగంలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో భారతీయ నిపుణులను ఆకర్షించేందుకు జర్మనీ ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించింది.
భారత ఐటీ నిపుణులకు వర్క్ వీసా నిబంధనలు సడలిస్తున్నట్టు జర్మనీ చాన్స్లర్ గత ఫిబ్రవరిలో ప్రకటించారు. భారత నిపుణులను ఆకర్షించడంలో జర్మనీ ప్రభుత్వ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో 14 వేల మంది భారతీయులకు జర్మనీ వర్క్ వీసాలను జారీచేసింది. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇవే అత్యధికం.