Mohammad Yunus | బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. దేశ సార్వత్రిక ఎన్నికలు వచ్చ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయన్నారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో యూనస్ మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వం తరఫున చీఫ్ ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. రాబోయే రంజాన్ కంటే ముందుగానే అంటే 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరనున్నట్లు తెలిపారు. జులై 2024 తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తిరుగుబాటు చేయడంతో చివరకు హసీనా ప్రభుత్వం ఆగస్టు 2024న పడిపోగా.. ఆమె భారత్‌కు చేరుకుంది. ఆ తర్వాత యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లోని రాజకీయ పార్టీలు తాజా సార్వత్రిక ఎన్నికలను డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏప్రిల్ 2026లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఖలీదా జియా పార్టీ బీఎన్పీతో పాటు ఇతర పార్టీలు డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మే 28న ఢాకాలో భారీ ర్యాలీ నిర్వహించి డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. జూలైలో తిరుగుబాటు చేసిన నాయకుల నుంచి ఏర్పడిన కొత్త రాజకీయ పార్టీ నేషనల్ సిటిజన్ పార్టీ సైతం సంస్కరణలు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ గతంలో వ్యాఖ్యానించారు.