కనానస్కిస్: ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలు ఐదవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కును బహిరంగంగా సమర్థించిన జీ7 దేశాలు పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత ఏర్పడేందుకు తమ మద్దతును పునరుద్ఘాటించాయి. కెనడాలో మూడు రోజులుగా జరుగుతున్న జీ7 సదస్సు నుంచి ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసిన జీ7 దేశాల నాయకులు ప్రాంతీయ అస్థిరతకు, భయానక పరిస్థితులకు ఇరాన్ని మూల కారణంగా అభివర్ణించారు. అణ్వస్ర్తాన్ని తయారు చేసేందుకు ఇరాన్ని ఎన్నటికీ అనుమతించరాదని వారు స్పష్టం చేశారు. గాజాలో కాల్పుల విరమణతో సహా ఉద్రిక్తతల సడలింపునకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని పరిరక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జీ7 నాయకులు ప్రకటించారు.