వాషింగ్టన్, జూన్ 28: ప్రవాస భారతీయులకు అగ్రదేశం అమెరికా ఊరట కల్పించింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ సవరించిన ముసాయిదా ప్రకారం ప్రతిపాదిత పన్నును 3.5 శాతం నుంచి కేవలం 1 శాతానికి తగ్గించింది. ఇది గతంలో ఆమోదించిన బిల్లుతో పోలిస్తే గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ ప్రతిపాదిత పన్ను బిల్లు ప్రకారం అమెరికాలో నివసిస్తున్న విదేశీ కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ తమ దేశాలకు పంపించే డబ్బుపై తప్పనిసరిగా పన్ను చెల్లించాలి. సవరించిన ముసాయిదా ప్రకారం ఇతర ఆర్థిక సంస్థలలో ఉన్న ఖాతాల నుంచి బదిలీలను మినహాయించింది. యునైటెడ్ స్టేట్స్లో జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్దుల ద్వారా జారీ చేసిన బదిలీలను కూడా మినహాయించింది. దీంతో రోజువారీ చెల్లింపులలో ఎక్కువ భాగం కొత్త పన్ను పరిధిలోకి రాకపోవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇది ఎన్ఆర్ఐలకు ఊరట కలిగించే అంశమే.
2026 జనవరి 1 నుంచి అమలు
సెనేట్ చేసిన ఈ ప్రతిపాదన ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత (2026 జనవరి 1 నుంచి) చేసే నగదు బదిలీలకు పన్ను చెల్లింపు విధానం వర్తిస్తుంది. తొలుత ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ అమెరికాలో పెద్దయెత్తున నివసిస్తున్న భారతీయులను తీవ్ర ఆందోళన పరిచింది. తాము పంపే మొత్తానికి పెద్దయెత్తున పన్ను రూపేణా అమెరికాకు చెల్లించాల్సి రావడమే ఇందుకు కారణం. భారత్‌లోని తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రవాస భారతీయులు క్రమం తప్పకుండా నగదును బదిలీ చేస్తుంటారు. అయితే ఈ పన్ను నిబంధన వారికి ఎంతో ఆర్థిక భారంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అమెరికాలో నివసిస్తున్న వారిలో రెండో అతిపెద్ద సమూహంగా భారతీయులే ఉన్నారు. ఆర్బీఐ డేటా 2024 ఆర్థిక సంవత్సరంలో భారత దేశం మొత్తం ఇన్వర్డ్ రెమిటెన్స్‌లలో అమెరికా వాటా 27 శాతం. ఇది 2.65 లక్షల కోట్ల రూపాయలకు సమానం.
ఎవరెవరు ఈ ట్యాక్స్ చెల్లించాలి?
అమెరికా పౌరసత్వం లేకుండా అక్కడ పనిచేస్తున్న అత్యుత్తమ వృత్తి నిపుణులు, గ్రీన్‌కార్డుదారులు, విద్యార్థులు ఈ టాక్స్‌ను చెల్లించాలి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పార్ట్‌టైం ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్ ద్వారా సంపాదిస్తున్న ఉద్యోగులు కూడా తమ వారికి డబ్బును పంపాలంటే ఈ పన్ను కట్టాల్సిందే. అలాగే ఎన్ఆర్ఈ అకౌంట్ డిపాజిట్‌దారులు, రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు, కార్పొరేట్ మొబిలిటీ కార్యక్రమాలకు, ముఖ్యంగా యూఎస్ పరిహారం, లేదా స్టాక్ ఆప్షన్లు పొందుతున్న వ్యక్తులు ఈ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు.