BYD | బీజింగ్, మార్చి 18: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూసుకెళ్తున్న చైనా కంపెనీ బీవైడీ.. మరో సంచలనం నమోదుచేయడానికి సిద్ధమైంది. కేవలం 5 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ కారును తయారుచేసినట్టు ‘బీవైడీ’ తాజాగా ప్రకటించింది. కారు బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో వాహనం 470 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, కారు వేగం 0 నుంచి 100 కిలోమీటర్లు అందుకునేందుకు కేవలం రెండు సెకన్లు తీసుకుంటుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
ఒక కప్పు టీ తాగి వచ్చే సరికి తమ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుందని, పెట్రోల్ లేదా డీజిల్‌ను ట్యాంక్‌లో నింపుకున్నట్టుగా కారు బ్యాటరీ చార్జింగ్ చేయొచ్చునని బీవైడీ తెలిపింది. బ్యాటరీ చార్జింగ్ టైమ్, సింగిల్ చార్జింగ్‌తో వాహనం ప్రయాణించే దూరం.. అనేవి దృష్టిలో పెట్టుకొని ‘హన్ ఎల్ సెడాన్’ అనే ఎలక్ట్రిక్ కారును తయారుచేసినట్టు బీవైడీ కంపెనీ చైర్మెన్ వాంగ్ ఛాన్ఫూ చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్ని వచ్చే నెల నుంచి మొదలవుతున్నట్టు తెలిపారు. ఇది త్వరలో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నదని సమాచారం.