AFG vs PAK : పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ హింస చెలరేగింది. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజా ఘర్షణల్లో రెండువైపులా డజన్ల మంది సైనికులు మరణించినట్లు సమాచారం. అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణపై మాట్లాడటం కోసం ఆఫ్ఘన్ వెళ్లేందుకు పాకిస్థాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ ఆఫ్ఘనిస్థాన్ వారిని అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ ఆరేబియాలను సంప్రతించింది. కాగా కాబూల్‌లోని తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (TTP) స్థావరాలపై గత వారం పాక్ సైన్యం దాడిచేసింది.
అయితే తాము టీటీపీకి ఆశ్రయం ఇవ్వడం లేదని, పాకిస్థాన్ ఆరోపణల్లో నిజం లేదని ఆఫ్ఘనిస్థాన్ కొట్టిపారేసింది. కాబూల్‌పై దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఔట్‌పోస్టులపై తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. దాంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖతార్, సౌదీ మధ్యవర్తిత్వం ద్వారా సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతుండగానే మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.