పారిస్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ నన్, సిస్టర్ ఆండ్రీగా పిలిచే లూసిల్ రాండన్ (118) మంగళవారం దక్షిణ ఫ్రాన్స్ టౌలోన్ పట్టణంలో తుదిశ్వాస విడిచినట్టు అధికార ప్రతినిధి డేవిడ్ తవెల్లా తెలిపారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని అలెస్ పట్టణంలో 1904 ఫిబ్రవరి 11న ఆమె జన్మించారు. కొవిడ్ నుంచి కోలుకున్న అత్యంత వృద్ధ మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా 110 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల వివరాలను జెరోంటాలజీ రిసెర్చ్ గ్రూప్ (జీఆర్జీ) ధ్రువీకరిస్తున్నది. అమెరికాలో జన్మించిన మరియా బ్రన్యాస్ మోరేరాను ప్రస్తుతం అత్యంత వృద్ధ వ్యక్తిగా తెలిపింది. ఆమె ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తున్నారు. ఆమె వయసు 115 ఏండ్లు.