పారిస్: ఫ్రాన్స్‌లోని అతివాద నేషనల్ ర్యాలీ పార్టీకి చెందిన పాపులర్ నేత మారిన్ లీపెన్(Marine Le Pen)పై అయిదేళ్ల బ్యాన్ విధించింది పారిస్ కోర్టు. దీంతో ఆమె 2027లో జరగబోయే ఫ్రాన్స్ అధ్యక్ష రేసుకు దూరం కానున్నారు. యురోపియన్ యూనియన్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు లీపెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆమెతో పాటు ఇతర నేతలు కూడా ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయిదేళ్ల బ్యాన్పై ఎటువంటి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. జడ్జి పూర్తి తీర్పును చదవకముందే.. లీపెన్ కోర్టు నుంచి వెళ్లిపోయారు. నేషనల్ ర్యాలీ పార్టీకి ఈయూ నిధుల్ని మళ్లించినట్లు లీపెన్‌పై ఆరోపణలు ఉన్నాయి.
2004 నుంచి 2016 మధ్య కాలంలో.. లీపెన్ తమ పార్టీకి సుమారు 33 లక్షల డాలర్లు నిధుల్ని మళ్లించినట్లు కోర్టు కేసులో తేలింది. ఈ కేసులో లీపెన్తో మరో 8 మంది ఈయూ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయితే లీపెన్ గతంలో మూడు సార్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. 2022లో ఎమ్మాన్యువల్ మాక్రన్ చేతిలో ఆమె ఓడిపోయారు. లీపెన్‌ను అతివాద నేతగా ఆమె విమర్శకులు పిలుస్తుంటారు. ఈయూ విధానాలను ఆమె అనేక సందర్భాల్లో వ్యతిరేకించారు.