పారిస్: ఫ్రాన్స్(France)లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరౌ ఓడిపోయారు. ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. 364-194 ఓట్ల తేడాతో ప్రధాని ఫ్రాంకోయిస్ పరాజయం చవిచూశారు. దీంతో అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ ఇబ్బందుల్లో పడ్డారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే విషయంలో ఆయన మళ్లీ బిజీ కావాల్సి వస్తోంది. రెండేళ్లలోనే అయిదోసారి కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రధాని బేరౌ ఇవాళ తన రాజీనామాను సమర్పించనున్నారు. మాక్రన్ కార్యాలయం ఆ రాజీనామాను ఆమోదించనున్నది. త్వరలోనే కొత్త ప్రధాని ప్రకటన ఉంటుందని అధ్యక్ష కార్యాలయం పేర్కొన్నది.
అయితే ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రకారం కొత్త ప్రధానిని ఎంపిక చేసేవరకు తాత్కాలిక ప్రధానిగా బేరౌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గత రెండేళ్లలో రెండుసార్లు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రధాని విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రధాని నియామకం మాక్రన్కు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ఆయన వద్ద ఇప్పుడు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే మాక్రన్ ముందున్న లక్ష్యం.
గత రెండేళ్ల నుంచి సమస్యలు వస్తున్నా.. ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం దేశాధ్యక్షుడు మొగ్గు చూపలేదు. ఒకవేళ ఈసారి ఎన్నికలకు వెళ్తే, ప్రభుత్వాన్ని రద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధాని వ్యక్తిని అధ్యక్షుడు నియమిస్తారు.