France | పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని మిషెల్ బార్నియర్ సారథ్యంలోని మితవాద మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం మూడు నెలల్లోనే కూలిపోయింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. వామపక్ష పార్టీలతోపాటు ఇతర పార్టీలకు చెందిన మొత్తం 331 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 577 పార్లమెంట్ సభ్యులలో 331 మంది బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో బుధవారం ప్రభుత్వం పతనమైంది. ప్రధాని బార్నియర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తన రెండు పర్యాయాల పదవీకాలంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
2025 జూలై వరకు కొత్తగా పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించడానికి అవకాశం లేకపోవడంతో రెండుగా చీలిపోయిన పార్లమెంట్‌ను కొనసాగించడానికి మాక్రాన్ ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో మాక్రాన్ హఠాత్తుగా పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునివ్వడంతో ఎన్నికైన సభ్యులు మూడు గ్రూపులుగా ఏర్పడడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఏ గ్రూపునకు లేకపోయింది. అత్యధిక ఓట్లు సాధించినప్పటికీ వామపక్ష కూటమికి మెజారిటీ సీట్లు లభించలేదు. రెండు నెలల రాజకీయ ప్రతిష్టంభన అనంతరం సెప్టెంబర్‌లో బార్నియర్‌ను ప్రధానిగా మాక్రాన్ నియమించారు. 1962 తర్వాత అవిశ్వాసం ద్వారా కూలిన తొలిప్రభుత్వం ఇదే.