Jimmy Carter | అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయనను దవాఖాన నుంచి ఇంటికి తరలించారు. చివరి రోజుల్లో కుటుంబసభ్యుల మధ్య గడపాలని జిమ్మీ కార్టర్ కోరుకోవడంతో ఆయనను స్వగృహానికి తీసుకొచ్చినట్లు ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంట్లోనే ఆయనకు చికిత్స అందించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
జిమ్మీ కార్టర్ కొంతకాలంగా మెలనోమా (Melanoma) అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇది అతడి కాలేయం, మెదడుకు వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. మెలనోమా అనేది ఒక రకమైన చర్మ క్యాన్సర్ (Skin Cancer). అమెరికా చరిత్రలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్. ఆయన 1977 నుంచి 1981 వరకు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ (US President) గా ఉన్నారు. అతను 2002 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
అమెరికాలోని జార్జియా (Georgia) లో 1924 లో ఓ రైతు కుటుంబంలో జిమ్మీ కార్టర్ జన్మించారు. 1960 ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన కార్టర్.. 1971 లో తొలిసారిగా జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సరిగ్గా ఆరేండ్ల తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి జిమ్మీ కార్టర్ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1978 లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన భారతదేశంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ సందర్భంగా గుర్గావ్ సమీపంలోని దౌల్తాపూర్ను సందర్శించడంతో ఆ ఊరు పేరు కాస్తా కార్టర్పూర్ మారిపోయింది.