శాన్ఫ్రాన్సిస్కో: ఓపెన్ ఏఐ మాజీ పరిశోధకుడు సుచిర్ బాలాజీ (26) గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఓపెన్ ఏఐలో సుమారు నాలుగేండ్లు పని చేశారు. సుచిర్ స్నేహితులు, సహోద్యోగులు ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఆయన అపార్ట్‌మెంట్‌కు వెళ్లేటప్పటికి, ఆయన మృతదేహం కనిపించినట్లు తెలుస్తున్నది. ఆయన మరణించినట్లు నవంబరు 26న ధ్రువీకరించారు. అయితే ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు.
సుచిర్ ఆగస్టులో ఓపెన్ ఏఐకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల తర్వాత ఓపెన్ ఏఐ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని ఆయన బయటపెట్టారు. చాట్ జీపీటీ వంటి టెక్నాలజీలు ఇంటర్నెట్కు నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అందుకే ఆ కంపెనీకి రాజీనామా చేశానన్నారు. చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీలు ఒరిజినల్ కంటెంట్‌కు సబ్‌స్టిట్యూట్స్‌ను సృష్టిస్తాయని సుచిర్ బాలాజీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఆయన ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఓపెన్ ఏఐ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న తీరును వివరించారు. ఆ తర్వాత ఓపెన్ ఏఐ కంపెనీపై అనేక మంది దావాలు వేశారు.