వెల్లింగ్టన్: ఎంగేజ్మెంట్ చేసుకున్న అయిదేళ్ల తర్వాత న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం నుంచి జీవిత భాగస్వామిగా ఉన్న క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె పెళ్లాడింది. కరోనా వైరస్ సమయంలో న్యూజిలాండ్‌లో అతి కఠినమైన ఆంక్షలను ఆమె విధించారు. తన పెళ్లిని కూడా ఆమె కరోనా వల్లే వాయిదా వేసుకున్నారు. వెల్లింగ్టన్కు 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాక్ బే ప్రాంతంలో ఉన్న ఓ విలాసవంతమైన తోటలో పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి వేళ కొందరు ఆందోళనకారులు వేదిక బయట వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పోస్టర్లతో నిరసన చేపట్టారు. 2014 నుంచి జెసిండా, గేఫోర్డ్ డేటింగ్లో ఉన్నారు. అయితే అయిదేళ్ల తర్వాత వాళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కోవిడ్ ఆంక్షల వల్ల 2022లో వాళ్ల పెళ్లికి అవాంతరాలు ఏర్పడ్డాయి. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చి తల్లి అయ్యారు. న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ మీటింగ్‌కు కూడా ఆ పాపను తీసుకెళ్లారు. 2023 జనవరిలో ఆమె అకస్మాత్తుగా ప్రధాని పదవికి రాజీనామాను ప్రకటించారు.