Gleycy Correia | ఆమె బ్రెజిల్ అందగత్తె.. అంతేకాదు.. మాజీ మిస్ బ్రెజిల్ కూడా. అయితే ఆ అతిలోక సుందరి టాన్సిల్స్ సర్జరీ చేయించుకోగా అది విఫలమైంది. రెండు నెలల పాటు కోమాలో ఉండి.. సోమవారం చనిపోయింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
బ్రెజిల్‌కు చెందిన గ్లెయిసీ కొరియా(27) 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. కొన్ని నెలల క్రితం ఆమె టాన్సిల్స్ సర్జరీ చేయించుకుంది. కానీ అది విఫలమైంది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. మెదడులో రక్తం గడ్డకట్టి పోయింది. ఏప్రిల్ 4న గుండెపోటు కూడా వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.
ఈ సందర్భంగా కొరియా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆమె మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని విలపించారు. కొరియా ఎంతో ప్రేమగల అమ్మాయి అని పేర్కొన్నారు. ఆమె లేకుండా తాము తమ జీవితాలను కొనసాగించడం కష్టమని చెప్పారు. కొరియా నవ్వే తమకు గుర్తొస్తుందని తెలిపారు.