ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలపై తూటా గాయాలు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన తర్వాత ఆ మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
మృతులు జాసన్ (46), ఆయన భార్య మెలిస్సా (42), వారు పిల్లలు రెనీ (15), అంబర్ (12), ఇవాన్ (9) గా పోలీసులు గుర్తించారు. కుటుంబ తగాదాల కారణంగానే ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. జాసనే తన భార్య, ముగ్గురు పిల్లలను కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నదని పోలీసులు వెల్లడించారు. ఈ మరణాల వెనుక బయటి వ్యక్తుల పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.