న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సుమారు అయిదు వందల కోట్ల మందికి లేదా జనాభాలోని రెండింటమూడో వంతు మందికి మెడికల్ ఆక్సిజన్(Medical Oxygen) అందుబాటులో లేదని, దిగువ.. మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు లాన్సెట్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొన్నది. మెడికల్ ఆక్సిజన్ భద్రతపై తొలిసారి లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కమిషన్ ఈ నివేదికను తయారు చేసింది. మెడికల్ ఆక్సిజన్ అసమాన రీతిలో సరఫరా జరుగుతున్నట్లు రిపోర్టు పేర్కొన్నది. పేషెంట్ల చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ చాలా కీలకమైంది. సర్జరీ, ఆస్తమా, ట్రామా, మెటర్నరీ, చైల్డ్ కేర్ సమయంలో ఆక్సిజన్ ఎక్కువగా అవసరం ఉంటుంది.
కోవిడ్19 లాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు .. మెడికల్ ఆక్సిజన్ సిద్ధంగా ఉండాలని అంతర్జాతీయ పరిశోధకులు ఈ నివేదికలో అభిప్రాయపడ్డారు. మెడికల్ ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లలో.. 82 శాతం మంది దిగువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. దీంట్లో 70 శాతం మంది దక్షిణ, తూర్పు ఆసియా, పసిఫిక్, సబ్ సహారా ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.